ఇందిరమ్మ టవర్లకు రెరా రిజిస్ట్రేషన్‌‌‌‌..ప్రభుత్వ ప్రాజెక్టు తొలిసారిగా రెరాలో నమోదు

ఇందిరమ్మ టవర్లకు రెరా రిజిస్ట్రేషన్‌‌‌‌..ప్రభుత్వ ప్రాజెక్టు తొలిసారిగా రెరాలో నమోదు
  • ఏడాదిలో టవర్లు పూర్తి చేయాలని సర్కారు ఆదేశం
  • ఆలస్యమైతే ఫిర్యాదు చేసే అవకాశం
  • ప్రతి ప్రాజెక్టుకు మూడు బ్యాంకు ఖాతాలు

హైదరాబాద్, వెలుగు: నగర పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వం నిర్మిస్తున్న ఇందిరమ్మ టవర్లకు తెలంగాణ రియల్‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌ రెగ్యులేటరీ అథారిటీ (టీజీ రెరా)లో రిజిస్ట్రేషన్‌‌‌‌ పూర్తయింది. ప్రభుత్వ ప్రాజెక్టు తొలిసారిగా రెరాలో నమోదైంది. దీంతో నిర్మాణంలో జాప్యం జరిగినా, నిబంధనలు ఉల్లంఘించినా లబ్ధిదారులు రెరాకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. బిల్డర్లకు నోటీసులు ఇచ్చి వివరణ కోరడంతోపాటు, సమాధానం సంతృప్తికరంగా లేకుంటే జరిమానా విధించవచ్చు.

క్యూర్‌‌‌‌ పరిధిలోని 26 నియోజకవర్గాల్లో ప్రభుత్వం ఇందిరమ్మ టవర్లు నిర్మిస్తోంది. ఇప్పటికే 16 నియోజకవర్గాల్లో పనులు ప్రారంభమయ్యాయి. ఒక్కో నియోజకవర్గంలో నాలుగు టవర్ల చొప్పున, ఒక్కో టవర్‌‌‌‌లో 120 ఫ్లాట్లు కలిపి మొత్తం 480 ఫ్లాట్లు నిర్మిస్తున్నారు. ఒక్కో ఫ్లాట్‌‌‌‌ ఖర్చు రూ.11 లక్షలు కాగా, రూ.5 లక్షలు ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తోంది. మిగతా రూ.6 లక్షలను లబ్ధిదారులు విడతల వారీగా చెల్లిస్తున్నారు.

ప్రాజెక్టు శంకుస్థాపన చేసిన ఏడాదిలోపు టవర్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం బిల్డర్లను ఆదేశించింది. గడువులోగా పనులు పూర్తి చేస్తే ప్రోత్సాహకం కూడా ఇస్తామని ప్రకటించింది. ప్రతి నియోజకవర్గానికి హౌసింగ్‌‌‌‌ బోర్డు, బిల్డర్‌‌‌‌, లబ్ధిదారుల పేర్లతో మూడు ప్రత్యేక బ్యాంకు ఖాతాలు (ఎస్క్రో) తెరిచారు. లబ్ధిదారులు నాలుగు విడతల్లో చెల్లించే మొత్తాన్ని ఈ ఖాతాల్లో జమ చేస్తారు. పనుల పురోగతిని బట్టి హౌసింగ్‌‌‌‌ బోర్డు బిల్డర్లకు నిధులు విడుదల చేస్తుంది.

రెరా అనుమతి పత్రాలు అందజేత.. 

హౌసింగ్‌‌‌‌ బోర్డు చేపట్టిన ఇందిరమ్మ టవర్స్‌‌‌‌ ప్రాజెక్టులకు రెరా అనుమతులు లభించాయి. సోమవారం రెరా చైర్మన్‌‌‌‌ శ్రీనివాసరాజు నుంచి అనుమతి పత్రాలను హౌసింగ్‌‌‌‌ బోర్డు వైస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ వీపీ గౌతమ్‌‌‌‌ అందుకున్నారు. ప్రతి కుటుంబానికి సొంతింటి కల నెరవేర్చే ఈ ప్రాజెక్టులకు రెరా అనుమతులు రావడం కీలక పరిణామమని గౌతమ్‌‌‌‌ అన్నారు. దీనివల్ల ప్రాజెక్టులపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని, నిర్మాణంలో పారదర్శకత, నాణ్యతకు ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు.

కొనుగోలుదారులను కాపాడేందుకే రెరా..

రియల్‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌ ప్రాజెక్టులు, బిల్డర్లు, ఏజెంట్లను నియంత్రించి కొనుగోలుదారుల ప్రయోజనాలు కాపాడేందుకు 2016లో రెరా చట్టం అమల్లోకి వచ్చింది. ప్రాజెక్టుకు రెరా నంబర్ కేటాయించగానే  ప్రాజెక్టుల వివరాలు తనిఖీ చేయడం, రిజిస్ట్రేషన్  ఫిర్యాదుల కోసం అధికారిక టీజీ రెరా  వెబ్‌‌‌‌సైట్ లో తనిఖీ చేసుకునే అవకాశం ఉంటుంది. 500 చదరపు మీటర్లకు మించిన స్థలం లేదా ఎనిమిదికి పైగా ఫ్లాట్లు ఉన్న ప్రాజెక్టులు తప్పనిసరిగా రెరాలో నమోదు చేసుకోవాలి. నిర్మాణ నిధుల్లో కనీసం 70 శాతం ప్రత్యేక ఎస్క్రో ఖాతాలో జమ చేయాలి. రెరా వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో ప్రాజెక్టు వివరాలు చూసుకోవడంతోపాటు, నిర్మాణంలో జాప్యం లేదా నిబంధనల ఉల్లంఘన జరిగితే కొనుగోలుదారులు ఫిర్యాదు చేయవచ్చు.